telugu navyamedia
తెలంగాణ వార్తలు

టీఆర్ఎస్ ఆవిర్భావ సభకి సర్వం సిద్ధం..భాగ్యనగరమంతా గులాబీమయం.

*హెచ్‌ఐసీసీలో 21 ఏండ్ల పండుగ

* ప్లీనరీలో 11 అంశాలపై తీర్మానాలు

*ప్లీనరీకి 3 వేలమందికి ఆహ్వానం

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకకు హైదరాబాద్ నగరం గులాబీమయంగా మారింది. నగరం నలువైపులా స్వాగత తోరణాలు తోరనాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు.. కటౌట్లు.. ఇలా ఎటు చూసినా గులాబీ రంగు పులుముకుంది.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి (ఏప్రిల్‌ 27)తో 21 వసంతాలు పూర్తి చేసుకొని, 22వ యేట అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌ మాదాపూర్‌ హైటెక్స్‌లో ఘనంగా సభ (ప్లీనరీ) నిర్వహిస్తోంది.

హైదరాబాద్‌ నగరం నలువైపులా స్వాగత తోరణాలు కట్టారు. ప్రధాన కూడళ్లను పార్టీ జెండాలు, అధినేతల ఫొటోలతో అలంకరించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. జెండా పండుగ కోసం నాలుగు కోట్ల గులాబీ జెండాలను సిద్ధం చేశారు.

తెరాస 2001లో ఆవిర్భవించినా ఇప్పటి వరకు 10 ప్లీనరీలను పార్టీ నిర్వహించింది. గత అక్టోబరులో జరిగిన పదో ప్లీనరీలో కేసీఆర్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవీకాలం రెండేళ్లపాటు ఉంటుంది. దీంతో బుధవారం జరిగే ప్లీనరీలో అధ్యక్ష ఎన్నిక ఉండదు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపించనున్న నేపథ్యంలో ఏర్పాటు చేయబోతున్న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సం ప్రాధాన్యతను సంతరించుకుంది. అరవై లక్షలకు పైగా కార్యకర్తలున్న టీఆర్ఎస్ పార్టీ కేవలం మూడు వేల మంది ముఖ్యులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఆరు వేల మందికి సరిపడా ఏర్పాట్లతో ఇప్పటికే హైటెక్స్ ప్రాణంగం సిద్ధమైంది.

ఉదయం 10 గంటలకల్లా ప్రతినిధులు హెచ్​ఐసీసీకి చేరుకుంటారు. ఉదయం 11 వరకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం ఉంటుంది. 11 గంటల 5 నిమిషాలకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్… వేదికపై అమరవీరులకు నివాళి అర్పిస్తారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి.. తెరాస జెండాను ఆవిష్కరిస్తారు. కేసీఆర్ స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది.

21 ఏళ్ల ప్రస్థానంతోపాటు… ఎనిమిదేళ్ల తెరాస పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కేసీఆర్ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం, భాజపాపై విరుచుపడనున్నట్ల తెలుస్తోంది. కేసీఆర్ జీవిత విశేషాలు, ఉద్యమ చరిత్ర, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించే ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్లీనరీలో 11 అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్లీనరీ ముగుస్తుంది.

నేటి ప్లీనరీ వేదికగా పార్టీ శ్రేణులకు గులాబీ బాస్ సీఎం కేసీఆర్ రాజకీయ, ప్రభుత్వపరమైన అంశాలపై కీలక దిశానిర్దేశం చేయనున్నారు.

 

Related posts