టిక్‌టాక్ సెలబ్రిటీ సోనాలి ఫొగాట్ హరియాణా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని చవిచూసింది. ఈసారి ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసేందుకు భాజపా పలువురు క్రీడాకారులతో పాటు, నటులకు కూడా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. గురువారం వెల్లడైన ఫలితాల్లో ఆదంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సోనాలిపై కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ బిష్ణోయ్ దాదాపు 30వేల ఓట్లతో ఘన విజయం సాధించారు. దాదాపు గత 50 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో బిష్ణోయ్ కుటుంబమే పైచేయి సాధిస్తోంది. రాష్ట్రంలో భాజపానే విజయం సాధిస్తుందని పార్టీ నేతలకు భారీ అంచనాలు ఉండటంతో, ఆదంపూర్‌లో సైతం తానే గెలుస్తానని సోనాలి భావించారు.
ఫలితాల్లో బిష్ణోయ్‌కు 64వేల ఓట్లు(51.66 శాతం) రాగా, సోనాలి ఫొగాట్‌కు కేవలం 34వేల ఓట్లు(27.8 శాతం) మాత్రమే వచ్చాయి. దుశ్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ పార్టీకి చెందిన రమేష్ కుమార్ 15వేల ఓట్ల(12.55శాతం)తో మూడో స్థానంలో నిలిచారు. గురువారం విడుదలైన హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ రాష్ట్రంలో పార్టీ 75 స్థానాలు గెలవడమే లక్ష్యం పెట్టుకుంది. ఫలితాలు అందుకు విరుద్ధంగా రావడం గమనార్హం. భాజపా 40 స్థానాల్లో, కాంగ్రెస్ 31 స్థానాల్లో విజయం సాధించాయి. దుశ్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటును నిర్దేశించనుంది. మిగతా స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.