టిడిపి నేతలు, చంద్రబాబు తలపెట్టిన దీక్షకు మద్దతునివ్వాలని జనసేనను కోరారు. పోలిట్ బ్యూరో సభ్యులు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ను విజయవాడలోని ఆయన నివాసంలో బుధవారం కలిశారు. అనంతరం విలేకర్లతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు దీక్షకు మద్దతునివ్వాల్సిందిగా పవన్‌ను కోరామన్నారు. అందుకు పవన్ సానుకూలంగా స్పందించి, సంఘీభావం తెలుపుతామన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బ తింటోందని, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, లోపాలను ప్రశ్నిస్తుంటే… వ్యక్తిగత విమర్శలతో దాడి చేస్తున్నారని అన్నారు.
ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దీక్షతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. ప్రభుత్వ విధానాలతో రోజుకో సమస్య తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఇసుక కొరత, తెలుగు మాద్యమాన్ని రద్దు చేయడం, అమరావతి నిర్మాణం నుంచి సింగపూర్ సంస్థ వైదొలగడం వంటి సమస్యలు తెస్తున్నారని విమర్శించారు. తాము చేపట్టే దీక్షకు బిజెపి, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల మద్దుతు కూడా కోరామన్నారు. వర్ల రామయ్య మాట్లాడుతూ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టాలన్నారు. ఇసుక వారోత్సవాలు నిర్వహించడం వల్ల ఉపయోగం లేదన్నారు. గత ప్రభుత్వ తరహాలో ఇసుక విధానాన్ని సరళీకరించి, ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని సూచించారు.