telugu navyamedia
ఉద్యోగాలు

ఎస్‌బీఐలో 2056 పీఓ పోస్టులకు ప్రకటన

బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! ఎప్పటినుంచో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పీఓ నియామక ప్రకటన వెలువడింది. దీని ద్వారా 56 బ్యాక్‌లాగ్‌ పోస్టులతో కలిపి.. 2056 పీఓ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు వీటికి
దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాతో విధుల్లో కొనసాగవచ్చు.

వేతనం, ఇతర ప్రోత్సాహకాల కారణంగా ఎస్‌బీఐ పీఓ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంటోంది. ఈసారి ప్రిలిమ్స్, మెయిన్స్‌లో సెక్షన్ల వారీ కటాఫ్‌ మార్కుల నిబంధన లేకపోవడం అభ్యర్థులకు మేలుచేసే అంశంగానే చెప్పుకోవచ్చు. నవంబరు చివర్లో లేదా డిసెంబరు మొదట్లో ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఫిబ్రవరితో
ముగుస్తాయి. ఫలితాలు మార్చిలో వెలువడతాయి. అందువల్ల పీఓలుగా ఎంపికైనవారు ఏప్రిల్‌ నుంచే విధుల్లో చేరే అవకాశం ఉంది. డిగ్రీ ఉత్తీర్ణులకే కాకుండా.. ఇప్పుడు సెమిస్టర్‌/ తుది సంవత్సరంలో ఉండి డిసెంబరు 31 నాటికి డిగ్రీ పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చే అవకాశమున్న అభ్యర్థులకూ ఇది చక్కని అవకాశం.

ఫేజ్‌-1 (ప్రిలిమినరీ), ఫేజ్‌-2 (మెయిన్‌ ఎగ్జామ్‌), ఫేజ్‌-3 (గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ)

నోటిఫికేషన్‌ క్లుప్తంగా..

మొత్తం ఖాళీలు: 2056

విభాగాలవారీ: ఎస్సీ 324, ఎస్టీ 162, ఓబీసీ 560, ఈడబ్ల్యుఎస్‌ 200, జనరల్‌ 810 పోస్టులు కేటాయించారు.

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: ఏప్రిల్‌ 1, 2021 నాటికి 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 25
ఫేజ్‌-1 ప్రిలిమినరీ పరీక్షలు: నవంబరు/ డిసెంబరులో
ఫేజ్‌-2 మెయిన్‌: డిసెంబరులో
ఫేజ్‌-3 ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్క షన్‌లు: ఫిబ్రవరిలో

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈబీసీలు రూ.750 చెల్లించాలి.

ఫేజ్‌-1 పరీక్ష కేంద్రాలు: ఏపీలో: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌.

వెబ్‌సైట్‌: https://sbi.co.in/

 

Related posts