ఐపీఎల్ 2021 కోసం ప్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ 2021 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ సలహాదారుగా టీమిండియా మాజీ ఆటగాడు, భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను నియమించినట్లు ప్రకటించింది. ‘సంజయ్ బంగర్.. ఆర్‌సీబీ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా మా జట్టుకు సహాయపడతారని ఆశిస్తున్నాం’ అని ఆర్‌సీబీ ట్విటర్ వేదికగా పేర్కొంది. సంజయ్ బంగర్ గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు 2014 నుంచి 2016 వరకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. అంతేగాక 2017 నుంచి 2019 ప్రపంచకప్ వరకు విరాట్ కోహ్లీ సారధ్యంలోని టీమిండియాకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పునకి సంజయ్ కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంతోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతనిపై వేటు వేసింది. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ ఉన్న విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ సిరీస్ అనంతరం బెంగళూరు టీమ్ క్యాంప్ నిర్వహిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఆర్సీబీ.. సంజయ్ బంగర్ పర్యవేక్షణలో ఆ క్యాంప్ ఉంటుందని తాజాగా వెల్లడించింది. ఇప్పటికే ఆర్సీబీ టీమ్‌లో బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా శ్రీధరన్ శ్రీరామ్ ఉన్నాడు. ఇక సైమన్ కటిచ్ హెడ్ కోచ్‌గా ఉండగా.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్‌గా మైక్ హసన్ ఉన్నాడు. తాజాగా బంగర్ ఆర్సీబీ స్టాఫ్‌లోకి చేరడంతో ఆ టీమ్‌లో కోచింగ్ అనుభవం మరింత పెరిగింది. ఈనెల 18న ఆటగాళ్ల వేలం ప్రక్రియ చెన్నై వేదికగా జరగనుంది. ఇప్పటికే వేలంలోకి క్రిస్ మోరీస్, అరోన్ ఫించ్, ఉమేశ్ యాదవ్, మొయిన్ అలీ, ఇసుర ఉదాన లాంటి స్టార్ ఆటగాళ్ళని వదిలేసిన ఆర్సీబీ.. తాజాగా కోచింగ్ స్టాఫ్‌లోకి సంజయ్ బంగర్‌ని బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా తీసుకుంది. ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్‌కి చేరిన ఆర్సీబీ.. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో పేలవంగా ఓడిపోయింది. ఐపీఎల్ 2021 సీజన్ వేలానికి ఏకంగా రూ. 35.7 కోట్ల పర్స్ వాల్యూతో బెంగళూరు ఫ్రాంఛైజీ వెళ్తోంది.