నేడే భారత్‌కు రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ దేశ రాజధాని ఢిల్లీకి రానున్నారు. పుతిన్ చివరిసారిగా 2021లో భారత్‌కు వచ్చారు.
ఆ తర్వాత మళ్లీ రావడం ఇదే. షెడ్యూలు ప్రకారం ఆయన గురువారం సాయంత్రం 7 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే ప్రైవేట్ డిన్నర్‌కు హాజరవుతారు.
శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం పుతిన్ రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మగాంధీకి నివాళులర్పిస్తారు.
అనంతరం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ-పుతిన్ నడుమ సమావేశం జరుగుతుంది.
భేటీ ముగిశాక ఇద్దరు నేతలూ కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. తర్వాత ప్రధాని మోదీ ఇచ్చే వర్కింగ్ లంచ్‌కు పుతిన్ హాజరవుతారు.
అనంతరం ఢిల్లీలోని భారత్ మండపంలో.. ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించే విందు కార్యక్రమానికి పుతిన్ హాజరవుతారు. దీంతో పుతిన్ భారత పర్యటన పూర్తవుతుంది.
పుతిన్‌తో పాటు ఈ పర్యటనకు వస్తున్న రష్యా రక్షణ మంత్రి అంద్రే బెలొసోవ్ మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో గురువారం భేటీ కానున్నారు.
మరో ఐదు యూనిట్ల ఎస్-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, ఎస్‌యు-30 ఫైటర్ జెట్ల నవీకరణ, ఇతరత్రా కీలకమైన మిలటరీ హార్డ్‌వేర్ సరఫరా అంశాలు వీరి భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి.
పౌరు అణు ఇంధన సహకారానికి సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి రష్యా క్యాబినెట్ బుధవారం పచ్చజెండా ఊపింది. రష్యాకు చెందిన రోసాటోమ్ న్యూక్లియర్ కార్పొరేషన్ తమిళనాడులోని కూడంకుళంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
రష్యా ప్రభుత్వం తరఫున ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి ఆ సంస్థకు రష్యా క్యాబినెట్ అధికారం ఇచ్చింది.
పుతిన్ ఇక్కడికి రావడానికి ముందే రష్యా ‘ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీ్‌స’కు చెందిన దాదాపు 50 మంది అత్యున్నతస్థాయి పోరాట నైపుణ్యాలు కలిగిన కమాండోలు భారత్‌కు చేరుకున్నారు.
ఢిల్లీ పోలీసులు, ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌తో కలిసి వీరు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఈ పర్యటన కోసం పుతిన్ రష్యాలో వాడే ‘ప్రెసిడెన్షియల్ లగ్జరీ లిమోజిన్’ కారు ఆరస్ సెనాట్‌ను మాస్కో నుంచి విమానంలో తీసుకొస్తున్నారు.

