నిన్న వాంఖడే మైదానంలో ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఆఖరి ఓవర్లో ఛేదించిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఢిల్లీ మ్యాచుపై పూర్తి పట్టు సాధించినా.. చివరలో సొంత తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచులో 3 ఓవర్లు వేసిన రవిచంద్రన్ అశ్విన్ 14 పరుగులే ఇచ్చాడు. ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. 54 బంతుల్లో 92 పరుగులు అవసరమైన క్రమంలో అశ్విన్ మూడో ఓవర్ పూర్తి చేశాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన అతడికి మరో ఓవర్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ‘మ్యాచుపై సమీక్ష చేసేటప్పుడు ఈ విషయం గురించి కచ్చితంగా మాట్లాడతా. అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లు వేసి 14 పరుగులే ఇచ్చాడు. తొలి మ్యాచులో నిరాశపరిచినా.. ఈ పోరులో అదరగొట్టాడు. అతడికి తర్వాత బౌలింగ్ ఇవ్వాల్సింది. ఇది పొరపాటే’ అని రికీ పాంటింగ్ అన్నాడు. అలాగే ఇషాంత్ శర్మ స్థానాన్ని అవేష్ ఖాన్ పూర్తి స్థాయిలో భర్తీ చేస్తాడని ఆశిస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చెప్పాడు. ఇషాంత్ అనుభవం జట్టుకు అవసరమొస్తుందని అభిప్రాయపడ్డాడు.

