ప్రభుత్వానికి బీసీల మీద ప్రేమ ఉంటే బీసీ బడ్జెట్ ఎందుకు తగ్గించారో చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో.. నాలుగేళ్లలో బీసీలకు రూ.4, 800 కోట్లు పెట్టామన్నారు. వైఎస్ హయాంలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. టీడీపీ హయాంలోనే బీసీ కమిషన్ తీసుకొచ్చామన్నారు. పుట్టస్వామి, మంజునాథ కమిషన్లు తీసుకొచ్చామని ఆయన చెప్పారు.
పాదయాత్రలో జగన్ 255 హామీలు ఇచ్చారని, మేనిఫెస్టోలో అదనంగా 65 హామీలు ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అడుగుతున్నామని అన్నారు. టీడీపీ డిప్యూటీ లీడర్లను సస్పెండ్ చేసి ప్రభుత్వం తప్పించుకోవాలనిచూస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక..ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. సీఎం జగన్ చేసేవన్నీ తప్పుడు విధానాలే అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. జగన్ ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేయకుండా రైతులకు అన్యాయం చేసిందన్నారు.