నా మది…
నదిలా పరుగులు తీస్తోంది….
నీకోసమే….!
ఉదృతమయిన ఉరుకులు..
ఉవ్వెత్తున ఎగసే పరుగులు
బరువైన శ్వాస నిశ్వాసలు..
నాలో అలజడిని కలిగిస్తున్నాయి….!
దూరమైనా.. భారమైనా..
అలసట కలిగినా.. ఆలశ్యమయినా..
మలుపులు తిరిగి ముగ్దలా
నిను చేరే నీ నదిని..
నీ పరిష్వంగములో చేర్చుకుని…
ఎదకు హత్తుకుంటావు కదూ..!
కొండలెక్కి దూకుతున్నాను..
కోనల్లో సాగుతున్నాను..
గతి తప్పక శృతులన్నీ సరిచేసుకుంటూ..
లయగా పరవళ్ళు తొక్కుతూ..
ప్రవహిస్తున్నాను….!
ఎన్నాళ్ళ విరహమో..
తీర్చుకునే రోజు చేరువవుతుంటే..
మనసంతా.. తలపుల గిలిగింత..
వయ్యారి వలపుల పులకింత…!
ఆర్తిగా ఆత్మలు పెనవేసుకునే..
మన సంగమం
అవనిని మురిపించాలి..
ఆకాశాన్ని అలరించాలి..
ఎన్ని యుగాలు గడిచినా.. తరాలు మారినా..
నా మదిలో నువ్వూ.. నీ ఎదపై నేనూ..
నీకోసం నేనూ.. నాకోసం నువ్వూ.. అంతే..!!