telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు…?

AA

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్‌ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “పుష్ప”. ఈ మూవీలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మొదటిసారిగా జత కట్టబోతోంది. జగపతి బాబు, బాబీ సింహా తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా… ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో బన్నీ చిత్తూరు జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్‌లో భాగంగా బన్నీ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అల్లు అర్జున్‌పై ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా నేపథ్యంలో కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినప్పటికీ అల్లు అర్జున్‌తోపాటు పుష్ప సినిమా యూనిట్ నిబంధనలు ఉల్లంఘించి జలపాతాన్ని సందర్శించిందని, అంతేకాక, తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండానే షూటింగ్ చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తీక్‌రాజు పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించినప్పటికీ, ప్రాథమిక విచారణ తర్వాత మాత్రమే కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Related posts