ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ఇవాళ సభ నుంచి వాకౌట్ చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇచ్చే నిబంధన మన భారత రాజ్యాంగంలో లేదని అన్నారు. అలాగైతే జగన్ జర్మనీ వెళితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
జర్మనీలో ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా చట్టసభల సీట్లు కేటాయిస్తుంటారని, ఒకవేళ ఒక పార్టీకి 5 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తే ఆ ఓట్లను ఇతరులు పంచుకుంటారని పవన్ వివరించారు.
జగన్ ఇంకా ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పడితే జర్మనీ వెళితే సరి అని పవన్ ఖ్యానించారు. ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రి, స్పీకర్ ఇస్తే తీసుకునేది కాదని ఆ హోదాను ప్రజలు ఇస్తారని పవన్ చెప్పారు.
వైసీపీకి ప్రజలు కేవలం 11 సీట్లను మాత్రమే ఇచ్చారని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదని ఎద్దేవా చేశారు.
వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చి ఉన్నా ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్లమని తెలిపారు.
సభకు వచ్చిన వెంటనే ఆందోళన చేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఈ ఐదేళ్లలో మీకు ప్రతిపక్ష హోదా రాదు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయని అన్నారు.
ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి సభకు రావాలని మీకు వచ్చిన సీట్లకు అనుగుణంగా సభలో మాట్లాడేందుకు స్పీకర్ సమయాన్ని కేటాయిస్తారని అన్నారు.