ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో ఎంతోకాలంగా వేచి చూస్తున్న రామాలయ ధ్వజారోహణం ఘనంగా జరిగింది.
గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సీతారాముల కళ్యాణం జరిగిన మార్గశిర మాసం శుక్లపంచమి రోజున అభిజిత్ ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగడం విశేషం.
17వ శతాబ్దంలో అయోధ్యలో నిర్విరామంగా 48 గంటలపాటు ధ్యానం చేసిన సిక్కుల ఆరో గురువు తేజ్ బహదూర్ అమరత్వం పొందిన రోజు కూడా ఇదే కావడం గమనార్హం.
2020 ఆగస్టు 5న రామమందిరం నిర్మాణానికి భూమిపూజ, అయోధ్యలో 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగాయి.
రామ్‌లల్లా ఆలయంపై ఏర్పాటు చేసిన కాషాయ ధ్వజం త్రిభుజాకారంలో 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉంది.
జెండాపై ఆధ్యాత్మిక ధ్వనికి ప్రతీకగా ‘ఓం’ అక్షరాన్ని రాముడి సూర్యవంశ వంశానికి సూచికగా ‘సూర్యుడు’, కశ్యప మహర్షి మందార, పారిజాత మొక్కలను కలిపి సృష్టించిన ‘కోవిదార్ చెట్టు’ చిహ్నాలను ఉంచారు.
వాల్మీకి రామాయణం అయోధ్య కాండలోనూ ఈ జెండా గురించి ప్రస్తావన ఉందని ప్రముఖ సాంస్కృతిక వ్యవహారాల పరిశోధకుడు లలిత్ మిశ్రా గుర్తించారు. ఆ సమాచారం మేరకే ఈ జెండాను రూపొందించారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల పారాచ్యూట్ తయారీ సంస్థ ఈ జెండాను తయారుచేసింది.
సుదీర్ఘకాలం మన్నేలా పారాచ్యూట్ గ్రేడ్ వస్త్రంతో, పట్టుదారాలతో 25 రోజుల పాటు శ్రమించి దీన్ని తీర్చిదిద్దారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయ్యిందనే దానికి సంకేతంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. గతేడాది జనవరి 22న ఈ ఆలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేశారు.
ధ్వజారోహణ వేడుక కోసం సుమారు 100 టన్నుల రకరకాల పూలతో ఆలయాన్ని, నగరంలోని మార్గాలను సుందరంగా అలంకరించారు. దాదాపు 7 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.
అతిథులంతా ఈ వేడుకలను వీక్షించేందుకు 200 అడుగుల వెడల్పు గల ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు.
అద్భుత ఘట్టం ఆవిష్కృతమైన సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
అయోధ్య పర్యటనలో భాగంగా హర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆయనకు స్వాగతం పలికారు.
అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య మోదీ రోడ్ షో నిర్వహించారు. చిన్నారులు, మహిళలు ఆయనకు స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు.
రోడ్‌షో తర్వాత రామజన్మభూమి ఆలయంలో శేషావతార్ మందిరంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు.

