కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు విధిగా జాగ్రత్తలు పాటించాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ వైరస్ కు మెడిసిన్ వచ్చేంత వరకు సామాజిక దూరంతోపాటు, మాస్కులు ధరించడమే మన తక్షణ కర్తవ్యమని చెప్పారు. ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్ గార్ అభియాన్ ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యూపీలోని ఆరు జిల్లాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించి, రెండు గజాల ఎడం పాటిస్తూనే ఉండాలని చెప్పారు.కరోనా కట్టడి కోసం యూపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా గొప్పగా ఉన్నాయని మోదీ ప్రశంసించారు.
ఇంగ్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల జనాభాతో యూపీ జనాభాను పోలుస్తూ ఆ దేశాల్లో 1,30,000 కరోనా మరణాలు సంభవించాయని తెలిపారు . యూపీలో 600 మరణాలు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. ఆ దేశాల జనాభా 24 కోట్లు… యూపీ జనాభా కూడా 24 కోట్లేనని అన్నారు. కరోనా తీవ్రత ఎలాంటితో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గ్రహించారని అన్నారు. ఏమాత్రం కంగారు పడకుండా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని మోదీ చెప్పారు.