మల్నాడు రెస్టారెంట్‌లోని డ్రగ్స్ పార్టీ కేసులో మరో పోలీసు అధికారి కుమారుడు అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్‌ను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే ఈ కేసులో ఇంటలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజా కూడా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం మోహన్, రాహుల్ తేజా, హర్ష, మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో పాటు పలువురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
మల్నాడు డ్రగ్స్ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్‌పీ వేణుగోపాల్ కుమారుడి పాత్ర ఉన్నట్లు గుర్తించిన ఈగల్ టీం అతడిని అరెస్ట్ చేసింది.
మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో కలిసి రాహుల్ డ్రగ్స్ బిజినెస్ చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
నిజామాబాద్‌లో గత నెలలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో రాహుల్ సూత్రధారిగా ఉన్నాడు. ఆ కేసులో రాహుల్ ఏ3గా ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అతడిని అరెస్ట్ చేయకుండా.. కేవలం ఎఫ్‌ఐఆర్‌లో మాత్రమే రాహుల్ పేరును చేర్చారు.
ఈ విషయం తెలిసిన ఈగల్ టీం అధికారులు ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఇక మల్నాడు డ్రగ్స్ కేసుకు సంబంధించి.. రాహుల్, సూర్య , హర్ష కలిసి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లుగా ఈగల్ టీం గుర్తించింది.
మల్నాడు డ్రగ్స్ కేసులో పోలీసు అధికారుల కుమారుల పాత్ర వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
ఇక ఈ కేసులో సూర్యతో పాటు అరెస్ట్ అయిన ఆరుగురు నిందితులను ఈగల్ టీం అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
నిన్న తొలిరోజు కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు.. రెండో రోజు కూడా కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఓవైపు పోలీసు అధికారుల కుమారుల పాత్ర వెలుగులోకి వస్తుంటే మరోవైపు సినీ ప్రముఖులకు సంబంధించిన పాత్ర కూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.