telugu navyamedia
తెలంగాణ వార్తలు

సోనియా గాంధీకి రాజీనామా లేఖ..జైలుకెళ్లొచ్చిన వ్యక్తి కింద పనిచేయలేను

*కాంగ్రెస్ పార్టీకి, , పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా
*రాజీనామా లేఖ‌ను సోనియాగాంధీకి పంపించిన రాజ‌గోపాల్ రెడ్డి
*30 సంవ‌త్స‌రాలుగా కాంగ్రెస్‌లో కార్యకర్తగా పనిచేశా..
*ఏ పని అప్పగించినా రాజీపడకుండా పార్టీ కోసం పనిచేశా..
*కష్టాలను దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ఠ కోసం పాటుపడ్డా..
*జైలుకెళ్లొచ్చిన వ్యక్తి కింద పనిచేయలేను
*ఈ నెల 8న రాజీనామా

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం లేఖ రాశారు. కాంగ్రెస్‌ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు .గత ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా మీ(సోనియా గాంధీ) నాయకత్వంలో ఏ పని అప్పగించినా, ఎక్కడా రాజీపడకుండా కష్టపడ్డానని పేర్కొన్నారు.

కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీలో పనిచేశానని ప్రస్తావించారు. కానీ పార్టీకి విధేయులైన వారిని గత కొంతకాలంగా పదేపదే అవమానిస్తున్నారని అన్నారు. పార్టీ ద్రోహులు, మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారని..ఇది తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. . కాంగ్రెస్‌ను కొందరు నిర్వీర్యం చేశారని ఆరోపించిన కోమటిరెడ్డి.. ఎమ్మెల్యేలను గెలిపించలేని వారు ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపలేకపోయారని విమర్శించారు

కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని .. దీనిని తక్షణం ఆమోదించాలని రాజగోపాల్ రెడ్డి కోరారు.

ఇప్పటికే అనేక పార్టీలు మారి స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేశారు. జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేను. తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అన్న విషయం మీకు తెలియనది కాదు. అరవై ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు అనేక వందల మంది ఆత్మబలిదానాలు చేసిన విషయం మీకు తెలిసిందే. అందరి చొరవతో సాకారమైన తెలంగాణ రాష్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయింది. ఈ బంధీనుండి విడిపించేందుకు తెలంగాణాలో మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నేను నమ్ముతున్నా’నని లేఖలో పేర్కొన్నారు

ఈనెల 8వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా కోరారు. ఆగస్టు 8న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. దీంతో 8వ తేదీన రాజీనామా చేసిన తర్వాతే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts