ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో కలకలం రేపింది. ఇందుశ్రీ అనే విద్యార్థిని నేటి ఉదయం ఎల్ఐజీ బ్లాక్-18లో నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకడంతో తీవ్ర గాయాలపాలైంది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
వైద్యులు అప్పటికే ఇందుశ్రీ మృతి చెందినట్టు తెలిపారు. ఇటీవల ఇందుశ్రీ బాబాయి కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం ఇందూశ్రీకి తెలిసినప్పటికీ, తన తల్లిదండ్రులకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ చెప్పలేదు. నేడు విషయం తెలుసుకున్న ఇందుశ్రీ తండ్రి ఆమెను ఇదే విషయమై నిలదీయడంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.