telugu navyamedia
తెలంగాణ వార్తలు

చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించాం – సీఎం కేసీఆర్‌

*పోలీసు అధికారులందరికీ నా సెల్యూట్ ..
*అర్ధ‌రాత్రి కూడా మ‌హిళ‌లు స్వేచ్చ‌గా తిర‌గాలి..
*హైదరాబాద్ లో నేరాలు చాలా వరకు తగ్గాయి

*పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే సమాజానికి భరోసా

పోలీసు వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉంటేనే పౌర సమాజం అంత భరోసాగా ఉంటుంద‌ని, పోలీస్ వ్యవస్థకు కమాండ్ కంట్రోల్ సెంటర్ మూలస్తంభం లాంటిందని సీఎం కేసీఆర్ అన్నారు.

హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంత‌రం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… హైదరాబాద్‌లో ఇంతటి కమాండింగ్‌ వ్యవస్థ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరని, కానీ, చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఈ భవన నిర్మాణానికి ముఖ్య ప్రేరణ, కర్త, రూపకర్త, ప్రధాన వ్యక్తి డీజీపీ మహేందర్‌రెడ్డినే అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మొత్తం క్రెడిట్‌ ఆయనకే దక్కాలని సీసీసీని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించినట్లు తెలిపారు. సమాజం కోసం పాటుపడుతున్న పోలీసు అధికారులందరికీ నా సెల్యూట్ అని సీఎం కేసీఆర్ అన్నారు.

హైదరాబాద్ లో నేరాలు చాలా వరకు తగ్గాయ‌ని అన్నారు. ఇంకా నేరస్థులు కొత్త పద్ధతిలో నేరాలకు పాల్పడుతున్నార‌ని, వాటిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించాల‌ని పోలీసుల‌కు సీఎం విజ్ఞప్తి చేశారు.

డ్రగ్స్‌ను అరికట్టేందుకు సమర్థవంతంగా పని చేయాలని, ఆ మహమ్మారిని తరిమి కొట్టాలని పోలీస్‌ శాఖకు పిలుపు ఇచ్చారు.

ప్రభుత్వపరంగా పోలీసు వ్యవస్థకు అన్ని విధాలుగా సహకరిస్తామ‌ని అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ రావాలనేది నా కోరిక.. అది నెరవేరిందన్నారు.  వీటితో పాటు సంస్కారవంతమైన పోలీసు వ్యవస్థ నిర్మాణం కావాల‌ని, సైబర్ క్రైమ్స్ ప్రపంచానికి సవాల్ మారాయి. వీటిని అరికట్టేందుకు పోలీసు వ్యవస్థ కృషి చేయాలని కోరుతున్నాను. దేశంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ అత్యుత్తమంగా పనిచేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.

Related posts