కరోనాను నియంత్రించేందుకు ఏపీ సర్కార్ లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సొమ్ముచేసుకుంటున్నారు. వ్యాపారులు పెంచుతున్న ధరలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కేసులు నమోదు చేయడమే కాకుండా, అవసరమైతే జైలుకు పంపుతామని నాని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజలంతా సహకరించాలని ఇది వారికే కాకుండా దేశానికి కూడా మంచిదని చెప్పారు. సీఎం జగన్ చేసిన సూచనల మేరకు ఈ నెల 29వ తేదీన రేషన్ సరుకులు అందజేస్తామని తెలిపారు. తెల్ల కార్డుదారులకు ఉచితంగా రేషన్ సరుకులు, కిలో కందిపప్పు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.

