ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో సోమవారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు ఈ ఉదయం మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్న విక్రమ్ జోషి తన కుమార్తెలతో కలిసి ఇంటికి వెళ్తుండగా నడిరోడ్డుపై దుండగులు దాడిచేశారు. తుపాకులతో విచక్షణ రహితంగా కాల్చారు. జోషి తలపై బుల్లెట్ గాయాలయ్యాయి.
వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన మృతి చెందాడు. తన మేనకోడలిని వేధిస్తున్నారంటూ ఇటీవల ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే ఈ ఘటన జరగడం గమనార్హం. యువతిని వేధించిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.ఈ కేసులో ఇప్పటి వరకు 9 మంది నిందితులను అరెస్ట్ చేయగా, ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.