telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ : .. భారత్ ఖాతాలో .. మరో ఘనవిజయం..

india won on westindies in world cup match

ప్రపంచ కప్ లో భాగంగా మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్‌పై 125 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపొందింది. భారత బౌలర్ల ముందు విండీస్ బ్యాట్స్‌మెన్ నిలబడలేకపోయారు. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోయిన విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ సైకిల్ స్టాండ్‌ను తలపించింది. భారత బౌలర్లు విసిరిన బంతులను ఎదుర్కొనడంలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ వైఫల్యం చెందారు. దీంతో విండీస్ ఈ మ్యాచ్‌లో ప‌రాజ‌యం పాలై వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కోహ్లి (82 బంతుల్లో 72 పరుగులు, 8 ఫోర్లు) రాణించాడు. అలాగే వికెట్ కీపర్ ధోనీ (61 బంతుల్లో 56 పరుగులు నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆక‌ట్టుకునే ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో భారత్ పటిష్టమైన స్కోరు చేయగలిగింది.

విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్‌కు 3 వికెట్లు దక్కగా, షెల్డన్ కాట్రెల్, కెప్టెన్ జేసన్ హోల్డర్‌లు చెరో 2 వికెట్లు తీశారు. విండీస్ 34.2 ఓవర్లలోనే కుప్పకూలింది. 143 పరుగులకు ఆ జట్టు ఆలౌట్ అయింది. ఆరంభం నుంచి భారత బౌలర్లను విండీస్ బ్యాట్స్‌మెన్ ఎదుర్కొనలేకపోయారు. ఎప్పటికప్పుడు తమ వికెట్లను సమర్పించుకున్నారు. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో ఎవ‌రూ రాణించ‌లేదు. ఈ క్రమంలో విండీస్‌కు ఓటమి తప్పలేదు. కాగా భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 4 వికెట్లు తీసి మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే బుమ్రా, చాహల్‌లు చెరో 2 వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లకు చెరొక వికెట్ దక్కింది.

Related posts