గాజాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రశంసించారు.
గాజాలో శాంతి స్థాపన దిశగా కీలక పురోగతి కనిపిస్తోందని, ఇందుకు ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలోని కొన్ని కీలక షరతులకు పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ అంగీకారం తెలిపింది.
ఈ పరిణామం జరిగిన కొన్ని గంటలకే ప్రధాని మోదీ స్పందించారు. ట్రంప్ ఇచ్చిన గడువుకు ముందే హమాస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఈ విషయంపై ప్రధాని మోదీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు. “గాజాలో శాంతి ప్రయత్నాలు కీలక పురోగతి సాధిస్తున్న తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని మేము స్వాగతిస్తున్నాము.
బందీల విడుదల దిశగా వస్తున్న సంకేతాలు ఒక ముఖ్యమైన ముందడుగు. శాశ్వతమైన శాంతి కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుంది” అని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.