telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సిగాచీ పేలుడు ఘటనపై హైకోర్టు స్పందన: తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు

సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై కె. బాబురావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

సిగాచీ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే పేలుడు సంభవించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనలో 54 మంది మృతి చెందగా, 28 మంది గాయపడ్డారని, మరో 8 మంది ఆచూకీ లభ్యం కావడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.

మృతుల ఆచూకీ లేని కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటివరకు చెల్లించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

అంతేకాకుండా పరిశ్రమ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పేలుడుకు గల కారణాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు.

భానూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని పరిశ్రమలలో భద్రతా చర్యలు పటిష్ఠంగా ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Related posts