*హైదరాబాద్‌లో మెట్టుగూడలో పోలీసులు ఓవరాక్షన్
*అర్ధరాత్రి జిమ్‌ట్రైనర్ ఇంటిపై పోలీసులు దాడి..
*ఆరోగ్యరాజ్ ను చితకబాదిన పోలీసులు..
*బైక్ విషయంలో పోలీసులు, ఆరోగ్యరాజ్ మధ్య వివాదం..
సికింద్రాబాద్ మెట్టుగూడలో జిమ్ ట్రైనర్ ఆరోఖ్యరాజ్ పై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. పెద్ద కర్రలతో ఇష్టారీతిన దాడికి పాల్పడటంతో జిమ్ ట్రైనర్‌కు కాలు విరిగింది. దీంతో అతడు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.
వివరాల్లోకి వెళితే..
సికింద్రాబాద్ లాలాగూడ చెందిన సూర్య ఆరోగ్యరాజ్ (25) జిమ్ నడిపస్తున్నాడు. ఈనెల 3న రాత్రి ఇంటి వద్ద బైక్ విషయంలో ఓ వ్యక్తితో ఆరోఖ్యరాజ్‌కు చిన్న గొడవ జరిగింది. ఆ వ్యక్తి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నలుగురు కానిస్టేబుళ్లు రాత్రి 11 గంటల సమయంలో ఆరోఖ్యరాజ్ వద్దకు వచ్చి పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పారు.
ఉదయాన్నే వస్తానని చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ఆ నలుగురు పోలీసులు సూర్యపై కర్రలతో కొట్టి ఇష్టానుసారంగా దాడి చేశారు. తనను కొట్టొద్దంటూ అతడితో పాటు తల్లి ఎంత ప్రాధేయపడినా వినలేదు. కానిస్టేబుళ్ల దాడిలో బాధితుడికి శరీరమంతా గాయాలుతో పాటు ఎడమ కాలు విరిగింది. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కానిస్టేబుళ్లు ఆరోఖ్యరాజ్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. స్థానికులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల దెబ్బలకు ఆరోఖ్యరాజ్ ఎడమ కాలు విరిగినట్లు, కుడికాలుకూ తీవ్ర గాయాలైనట్లు డాక్టర్లు గుర్తించారు. పిడిగుద్దులతో అతడి ముఖం వాచిపోయింది. మంగళవారం సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులే బేరసారాలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఇక్కడితో వదిలేయాలని బాదితుడిని కోరినట్లు సమాచారం. ఆరోఖ్యరాజే ముందు తమపై దాడి చేసేందుకు యత్నించాడని.. తాము ప్రతిదాడి చేశామని కానిస్టేబుళ్లు చెబుతున్నారు.

