telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రేపు జార్జిరెడ్డి మళ్ళీ పుడుతున్నారు… : డైరెక్టర్ జీవన్‌రెడ్డి

George-Reddy

ఉస్మానియా యూనివర్సిటీలో 40 ఏళ్ల క్రితం హత్యకు గురైన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి మళ్లీ పుడుతున్నాడని ‘జార్జిరెడ్డి’ చిత్ర దర్శకుడు జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ‘జార్జిరెడ్డి’ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో గురువారం ఉదయం చిత్రయూనిట్ జార్జిరెడ్డి సమాధిని సందర్శించింది. నారాయణగూడలోని క్రైస్తవ స్మశానవాటికలో జార్జిరెడ్డికి చిత్ర బృందం నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘జార్జిరెడ్డి జీవిత చరిత్ర తెలుసుకున్నాక ఐదేళ్లు ఏ సినిమా చేయలేదు. ఆయన నిజాయితీ చెప్పేందుకే ఈ సినిమా తెరకెక్కించాము. నేను నాకంటే ఎక్కువ ప్రేమించే వ్యక్తి జార్జిరెడ్డి. రేపు ‘జార్జిరెడ్డి’ సినిమా విడుదల అవుతోంది. ఆయన మళ్లీ పుడుతున్నాడు. ఆయన చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి’’ అన్నారు. కో ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆయన చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని రెండేళ్లు ఈ సినిమాను చిత్రీకరించాము. సమాజంలో జార్జిరెడ్డి లాంటి వాళ్లను చాలామందిని కోల్పోయాం. అలాంటి వీరులను ఎలా కోల్పోయామో తెలియజేసేందుకే ఈ సినిమా నిర్మించాము. జార్జిరెడ్డి 25 ఏళ్లకే ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. జార్జిరెడ్డి క్యారెక్టర్‌ను ప్రజలకు కనెక్ట్ చేసేందుకు ఛాలెంజింగ్‌గా తీసుకుని పని చేశాం’’ అని చెప్పుకొచ్చారు.

Related posts