కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తమ ప్రయోగాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్నవ్యాక్సిన్ ట్రయల్స్ వికటించడంతో ప్రయోగాలు నిలిచిపోయాయి.
ట్రయల్స్ లో ఇలాంటి సమస్యలు సహజమేనని బ్రిటన్‌కు చెందిన డేటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్(డీఎస్ఎంబీ) తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ టీకా సురక్షితమేనని మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ తేల్చడంతో బ్రిటన్‌లో క్లినికల్స్ ట్రయల్స్‌ని పునఃప్రారంభించారు.
భారత్‌లోనూ డీఎస్‌ఎంబీ ఈ ప్రయోగాల పునఃప్రారంభానికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఆ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను మళ్లీ ప్రారంభించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించింది.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ట్రయల్స్‌ను కొనసాగించాలని చెప్పింది. స్క్రీనింగ్ దశలోనే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపింది. ట్రయల్స్ జరుపుతోన్న క్రమంలో దుష్ప్రభావాలు తలెత్తితే వాటిపై లోతుగా అధ్యయనం చేయాలని సూచించింది.