ఏఐసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో నేడు, రేపు చింతన్ శిబిర్ జరగనుంది. ఏఐసీసీ ఆమోదించిన 6 తిర్మానాలపై చర్చించనున్నారు. ఆరు కమిటీలో 30, 40 మంది నేతలు ఉండనున్నారు. ఆర్గనైజేషన్ కమిటీకి పొన్నాల లక్ష్మయ్య, యూత్ కమిటీకి దామోదర రాజనర్సింహ, ఎకానమీ కమిటీకి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు, పొలిటికల్ కమిటీకి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అగ్రికల్చర్‌కు ఎమ్మల్సీ జీవన్‌రెడ్డి, సోషల్ జస్టిస్‌కు వీహెచ్‌లు కన్వీనర్లు ఉన్నారు.
మొదటి రోజు సమావేశల్లో 6 కమిటీలు సమావేశమై వారికిచ్చిన అంశాలపై రిపోర్ట్ ప్రిపేర్ చేయనున్నారు. రెండోరోజు 6 కమిటీల కన్వీనర్లు మొదటి రోజు తయారు చేసిన రిపోర్ట్‌ను భట్టి నేతృత్వంలోని చింతన్ శిబిర్ నిర్వహణ కమిటీకి అందజేయనున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఉన్నందున ఈ సమావేశాలకు పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ఛార్జీ మాణిక్యంతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వం వహించనున్నారు.
ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉదయ్ పూర్ డిక్లరేషన్‌పై రెండు రోజులపాటు చింతన్ శిబిర్‌లో చర్చిస్తామని, తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మరికొన్ని అంశాలను పొందుపర్చి ఏఐసీసీకి నివేదిస్తామన్నారు. చింతన్ శిబిర్‌లో 6 అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఏఐసీసీ ఈ 6 అంశాలలో రాష్ట్రంలో ఉన్న అన్ని అంశాలూ ప్రతిబింబిస్తాయన్నారు.
చింతన్ శిబిరంలో తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికలకి రోడ్ మ్యాప్‌లా పని చేస్తాయని భట్టి పేర్కొన్నారు. జిల్లాల వారీగా కూడా చింతన్ శిబిర్ నిర్వహిస్తామన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ని జనంలోకి తీసుకెళ్లడం కోసమే ఈ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ఉండడం వల్లనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కాలేదన్నారు. రేవంత్ రెడ్డి రాకపోవడంలో ఎలాంటి వివాదం లేదని భట్టి తెలిపారు.


బీజేపీ ఒక్క మున్సిపాల్టీ గెలిచినా కాలర్ ఎగరేసే పరిస్థితి: కేటీఆర్