telugu navyamedia
National వార్తలు

రాజీనామా ముందు చేసిన వ్యాఖ్యలు వైరల్: ధన్‌ఖడ్ నిర్ణయం వెనుక ఏముంది?

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్య రీతిలో తన పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఆరోగ్య కారణాలను చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు పంపిన‌ త‌న‌ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

అయితే, ప‌ద‌వీకాలం ముగియ‌క‌ముందే ఆయ‌న రాజీనామా చేయ‌డంప‌ట్ల ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇటీవ‌ల ప‌ద‌వీ విర‌మ‌ణ గురించి మాట్లాడిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది.

రాజీనామాకు ప‌ది రోజుల‌ క్రిత‌మే ప‌ద‌వీ విర‌మ‌ణపై ధ‌న్‌ఖ‌డ్ మాట్లాడుతూ… 2027 ఆగ‌స్టులో స‌రైన స‌మ‌యంలో రిటైర్ అవుతాన‌న్నారు.

అయితే, అది దైవ నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని పేర్కొన్నారు. జులై 10న జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు విశ్వ‌విద్యాల‌యంలో ఉప రాష్ట్ర‌ప‌తి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అనంత‌రం ప‌ది రోజుల‌కు అనారోగ్య కార‌ణాల వ‌ల్లే తాను ప‌ద‌వి నుంచి వైదొలుగుతున్న‌ట్లు పేర్కొంటూ.. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు రాజీనామా లేఖ‌ను పంపారు.

వైద్యుల సూచ‌న మేర‌కు ఆరోగ్యానికి ప్రాధాన్య‌మిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 67(ఎ)కు అనుగుణంగా ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Related posts