భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ్ విదేశాలకు పారిపోయినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆయన సంబంధీకులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే.. గ్రీస్‌లో ఉన్నామని ఫోన్ పెట్టేసినట్లు వారి సన్నిహితులు చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భార్గవరామ్‌పై ఆళ్లగడ్డ, హైదరబాద్‌లలో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. భార్గవరామ్ తన బిజినెస్ పార్ట్‌నర్‌పై దాడి చేసినట్లు భార్గవరామ్‌పై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి, అఖిలప్రియలు క్రషర్ ఫ్యాక్టరీలో భాగస్వాములు. తర్వాత వ్యాపార లావాదేవీల్లో వివాదం మొదలయ్యింది. ఈ క్రమంలో అఖిలప్రియ భర్త భార్గవరామ్ తన భర్తపై హత్యాయత్నం చేశారని శివరామిరెడ్డి భార్య మాధవీలత ఆళ్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్గవరామ్‌తో పాటు మరో 10 మందిపై కూడా కేసు నమోదయ్యింది.
ఈ కేసుల విచారణలో భాగంగా భార్గవరామ్‌ను పట్టుకునేందుకు ఆళ్లగడ్డ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో భార్గవరామ్ పోలీసులకు కనిపించారని.. కారును ఆపినట్లే ఆపి.. ఆ తర్వాత వేగంగా కారును డ్రైవ్ చేసుకుని వెళ్లాడని ఆళ్లగడ్డ ఎస్‌ఐ పేర్కొన్నారు. అంతేకాదు కారుతో తమనను ఢీకొట్టేందుకు ప్రయత్నించారని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు (అక్టోబర్ 8) ఐపీసీ సెక్షన్లు 353, 336 కింద భార్గవరామ్‌పై కేసు నమోదు చేశారు. భార్గవరామ్‌పై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు ఓ వైపు ఆయన కోసం హైదరాబాద్‌తో సహా పలు చోట్ల విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఆయన సన్నిహితుల చెప్తున్న సమాచారంతో భార్గవ రామ్ విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు మాత్రమే స్పష్టత ఇవ్వగలరు.