భారతీయ వికెట్ కీపింగ్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై స్పష్టత వచ్చినా కూడా, ఇంకా ఆ విషయంపై చర్చలు మాత్రం ఆగలేదు. ప్రపంచ కప్ అనంతరం ధోనీ భవితవ్యం ఏంటన్నదానిపై ఇంతవరకు స్పష్టత లేదు. రెండు నెలల పాటు ధోనీ పారామిలిటరీ ట్రైనింగ్ కు వెళ్లనుండగా, ఆ తర్వాత ఏంటన్నది ఎవరికీ తెలియదు. సెలెక్టర్లు సైతం రిటైర్మెంటు నిర్ణయాన్ని ధోనీకే వదిలేశారు. ఈ నేపథ్యంలో, భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ, సెలెక్షన్ కమిటీ మధ్య భావప్రసారం (కమ్యూనికేషన్) చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. గ్యాప్ వచ్చిందంటే మాత్రం అపోహలు, అపార్థాలు ఏర్పడతాయని తెలిపారు. “ధోనీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రానందునే రిటైర్మెంటుపై ఊహాగానాలు వస్తున్నాయి.
ధోనీ రిటైర్ అవ్వాలని కొందరు, రిటైర్ కాకూడదని మరికొందరు ఎవరికి తోచినట్టు వాళ్లు రాస్తున్నారు. నా మటుకు ధోనీ ఫిట్ గా ఉన్నానని భావిస్తే నిస్సంకోచంగా ఆటను కొనసాగించాలని కోరుకుంటాను. చాలా సందర్భాల్లో ఎంతోకాలం పాటు క్రికెట్ ఆడిన తర్వాత ఆసక్తి సన్నగిల్లడం సహజం. ధోనీ ఆడాలనుకుంటే మాత్రం దూకుడుగా ఆడాలని చెబుతాను. కొంత వయసు పైబడిన తర్వాత ఆటలో వేగం మందగిస్తుంది. ధోనీ విషయంలో అలా కనిపించడంలేదు కాబట్టి తన సహజసిద్ధ ఆట ఆడుతున్నంతకాలం భారత జట్టుకు మేలు జరుగుతుంది. ఇప్పుడు రెండు నెలలు ఆట నుంచి విశ్రాంతి తీసుకుంటానని చెబుతున్నాడు. కానీ ఆ తర్వాత ఏంటనేది కూడా ధోనీ చెప్పాలి. ధోనీ ఓ నిర్ణయం తీసుకుంటే మాత్రం అది సరైనదే అవుతుందని భావిస్తాను.. అని అజారుద్దీన్ అభిప్రాయాన్ని తెలిపారు.
దిశ ఘటన : ఎన్కౌంటర్పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు