భారత విపణిలో జర్మనీకి చెందిన లగ్జరీ కార్లను తయారీ చేసే ఆటోమొబైల్ దిగ్గజం ‘ఆడి’.. ఇప్పుడు సరికొత్త ఎడిషన్ కారును ప్రవేశపెట్టింది. ‘ఆడీ ఎ6’ మోడల్ కారుకు కొత్త ఫీచర్లను జతచేసి ‘ఆడి ఎ6 సెడాన్ లైఫ్‌స్టైల్ ఎడిషన్’ పేరుతో నూతన కారును మంగళవారం భారత్‌లో ప్రవేశపెట్టింది. ‘రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్’, మొబైల్ కాఫీ మెషీన్ ‘ఎస్‌ప్రెస్సోం మొబిల్’, ఆడి లోగోతో కూడిన ‘ఎంట్రీ, ఎగ్జిట్ లైట్స్’ వంటి ఫీచర్లను ఈ కొత్త ఎడిషన్ కారులో జతచేసినట్లు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ కొత్త ఫీచర్లు వాహన ప్రియులను నచ్చుతాయని ఆడి ఇండియా హెడ్ రహిల్ అన్సారీ తెలిపారు. రియర్(వెనుక) సీట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణీకులకు 25.65 సెం.మీల తాకేతెర కలిగిన టాబ్లెట్ వినోదాన్ని పంచుతుందన్నారు. అంతేకాకుండా ఈ టాబ్లెట్ బయట కూడా పనిచేస్తుందని వివరించారు. ప్రస్తుతం ‘ఎ6 సెడాన్’ 1.8 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 2 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. అయితే ‘ఆడి ఎ6 సెడాన్’ ధరను భారత మార్కెట్‌లో రూ.49.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.