telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అశోక్ గజపతిరాజు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, పొలిట్ బ్యూరోకు, జీవితకాల సభ్యత్వంకు రాజీనామ

టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు.

ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆయ‌న‌ను గోవా గవర్నర్‌గా నియమించిన విష‌యం తెలిసిందే.

ఈ క్రమంలో ఆయన టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, పొలిట్ బ్యూరోకు, జీవితకాల సభ్యత్వంకు రాజీనామా చేశారు.

దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు టీడీపీలో పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

టీడీపీలో ఎన్నో అవకాశాలు అందుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇన్ని అవకాశాలు కల్పించిన పార్టీకి, సీఎం చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు ప్ర‌త్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవలే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు తనకు గోవా గవర్నర్‌గా అవకాశం కల్పించిన నేపథ్యంలో పార్టీకి పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

త్వరలోనే గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించవలసిందిగా ఆయ‌న‌ టీడీపీ అధిష్ఠానాన్ని కోరారు.

ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులకు పంపించారు.

అశోక్‌ గజపతి రాజు టీడీపీలో సీనియర్ నేత. విజయనగరం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా ఒకసారి గెలుపొందారు.

అశోక్ గజపతి రాజు తన తండ్రి పీవీజీ రాజు బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అశోక్ గజపతి రాజు తొలిసారిగా 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ఏపీ శాసనసభకు ఎన్నికయ్యారు.

ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి అశోక్‌ గజపతి రాజు పార్టీలో కొనసాగుతున్నారు.

2014లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అశోక్‌ గజపతి రాజు ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాణ శాఖ మంత్రిగా చేశారు.

Related posts