ప్రజాకాంక్షను గౌరవించి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశంతో ప్రజాభిప్రాయాన్ని సేకరించి సమగ్రమార్పులతో తుది మెరుగులు దిద్ది అధికార వికేంద్రీకరణకు సంబంధించి కొత్తబిల్లును శాసనసభముందుకు తీసుకొస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అధికార వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకుంటున్నామని ప్రకటిస్తూనే బిల్లులో సాంకేతిక పరమైన అంశాలతో సమగ్ర మార్పులుచేసి తీసుకొస్తామన్నారు. హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దనుకున్నానీ, వికేంద్రీకరణ సరైన మార్గమని నమ్మి చర్యలు చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. సర్వహంగులతో విశాఖను అభివృద్ధి చేస్తే పదేళ్లకు హైదరాబాద్‌తో పోటీ పడుతుందనే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఎంచుకున్నామన్నారు.
గతంలోనే అధికార వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే అమల్లోకి వచ్చి ఉంటే మూడు ప్రాంతాలు ప్రగతి పథంలో నడిచి ఉండేవని అభిప్రాయం వ్యక్తంచేశారు. అన్ని ప్రాంతాలు, అన్నికులాలు ఆశీర్వదించిన విషయాన్ని సభలో ప్రస్తావించారు. వికేంద్రీకరణకు అనేక అపోహలు, అనుమానాలతో దుష్ప్రచారం జరిగిందన్నారు. అధికార వికేంద్రీకరణకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే విధంగా సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. అన్నివర్గాలకు న్యాయంచేయాలని భావించిన ప్రభుత్వం, వికేంద్రీకరణ అవసరాన్ని, మూడు ప్రాంతాల ప్రగతికోసం ప్రజాభిప్రాయ సేకరణతో కొత్తగా బిల్లును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామనే విషయాన్ని సభలో ప్రకటించారు. శ్రీభాగ్ ఒడంబడిక ఆధారంగా ప్రభుత్వం అడుగులు వేసిందని, అధికార వికేంద్రీకణ బిల్లును పెట్టిన విషయాన్ని సభకు వివరించారు.
2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికార వికేంద్రీకరణకు అడుగులేశామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ఎంచుకున్నామన్నారు. అమరావతి ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు శాసన రాజధానిగా ఏర్పాటుచేయదలచుకున్నామన్నారు. కర్నూలు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా న్యాయ రాజధానిగా ఏర్పాటుచేయాలని భావించామన్నారు.
న్యాయపరమైన చిక్కులతో అధికార వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకుని, బిల్లుకు సమగ్ర రూపంతో సభలో ప్రవేశపెడుతామన్నారు.
టీడీపీ అందించిన సైకిళ్లకు వైసీపీ స్టిక్కర్లు: నారా లోకేశ్