telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మూడు రాజధానుల బిల్లు రద్దు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడురాజధానులతో అధికార వికేంద్రీకరణ, అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ బిల్లులను శాసనసభ రద్దుచేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికార వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే బిల్లులను రద్దుచేయాలని ప్రతిపాదన శాసనసభకు తీసుకొచ్చారు. అధికార వికేంద్రీకరణ బిల్లులోని అంశాలు, శివరామకృష్ణన్ కమిటీ ప్రతిపాదనలు సభలో వివరించే ప్రయత్నం చేశారు. పాలనా సౌలభ్యంకోసం… అన్ని ప్రాంతాలను సమగ్రాభివవృద్ధికోసం… అధికార వికేంద్రీకరించాలని ప్రయత్నించిన విషయాన్ని సుధీర్ఘంగా వివరించే ప్రయత్నంచేశారు.

ప్రజాస్వామ్యానికి మూలమైన శాసన, పాలన, న్యాయ సంబంధ వ్యవస్థలను అమరావతి, విశాఖ, కర్నూలు నగరాల్లో అధికార వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేకంగా ఐదు జోన్లు, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీని తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత అమరావతి రాజధాని కేంద్రంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధి చేయాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, తాత్కాలిక శాసనసభ, తాత్కాలిక సచివాలయాలను త్వరితగతిన పూర్తిచేశారు. చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కదలిక వచ్చింది.

అమరావతి పరిసరాల్లో రాజధాని ప్రకటనకు ముందే తెలుగుదేశంపార్టీ నాయకులు, వారి కుటుంబీకులు భూములు కొనుగోలుచేసి ఇన్ సైడర్ ట్రేడింగుకు పాల్పడ్డారననే అనుమానంతో రాజధాని మార్పునకు చర్యలు తీసుకున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా… కర్నూలును న్యాయరాజధానిగా… అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు చర్యలు చేపట్టింది. అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీని రద్దుచేసింది. దీంతో రైతులు, అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు అమరావతి రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని తేల్చింది.

తాజాగా హైకోర్టులో మూడు రాజధానుల అంశం మరోసారి విచారణకు రావడంతో అధికార వికేంద్రీకరణ అంశంలో సాంకేతికపరమైన సమస్యలున్నట్లు గుర్తించి బిల్లు ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Related posts