telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకుల్లో అద్భుతమైన స్థానంలో ఆంధ్రా యూనివర్సిటీ

ప్రతిష్ఠాత్మక ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏటా ప్రకటించే నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకుల్లో ఏయూ అద్భుతమైన ప్రతిభ కనబరిచింది.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల (స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ) విభాగంలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఘనతతో రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో అగ్రస్థానంలో నిలిచింది.

గతేడాది ఇదే విభాగంలో 7వ స్థానంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ, ఈసారి ఏకంగా మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 4వ ర్యాంకును దక్కించుకోవడం విశేషం.

కేవలం ఇదే కేటగిరీలో కాకుండా, ఇతర విభాగాల్లోనూ ఏయూ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలతో కూడిన జాబితాలో గతేడాది 25వ స్థానంలో ఉండగా, ఈ సంవత్సరం 23వ స్థానానికి చేరుకుంది.

మరోవైపు, దేశంలోని కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో కూడిన ఓవరాల్ కేటగిరీలో ఏయూ తన 41వ స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఫార్మసీ విభాగంలో 34 నుంచి 31వ స్థానానికి, ఇంజనీరింగ్ విభాగంలో 90 నుంచి 88వ స్థానానికి మెరుగుపడింది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల సైతం తన 16వ ర్యాంకును పదిలంగా ఉంచుకుంది.

ఈ సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అభినందనలు తెలిపారు.

ర్యాంకును మెరుగుపరుచుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఇంకా సాధించాల్సింది చాలా ఉందని, సుదీర్ఘ లక్ష్యాల సాధన కోసం మరింతగా కృషి చేయాలని యూనివర్సిటీ యాజమాన్యానికి, సిబ్బందికి సూచించారు.

Related posts