నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 20న ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ట్రయల్ కోర్టు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేసింది. ఇక ఎటువంటి పరిస్థితులలోనూ ఆగే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దోషులకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలు మూసుకుపోవడంతో ఈసారి ఉరి అమలు ఖాయంగా కనిపిస్తున్నది. దోషులు ఇప్పటికే అన్ని న్యాయపరమైన అవకాశాల్ని వినియోగించుకున్నారని ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా తాజా డెత్ వారెంట్లు జారీ చేశారు.
ఈ కేసులో దోషిగా ఉన్న పవన్ కుమార్ ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు క్షమాభిక్ష పిటిషన్ ను పెట్టుకోవడం, ఆ వెంటనే రాష్ట్రపతి దాన్ని తిరస్కరించడం తెలిసిందే. న్యాయపరమైన అవకాశాల పేరిట వారు పిటిషన్లు దాఖలు చేయడంతో ఉరి అమలు తేదీ ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. అయితే దోషుల్ని మార్చి 20న ఉరి తీయాలని ట్రయల్ కోర్టు తాజాగా డెత్ వారెంట్లను జారీ చేయడంతో ఈసారి శిక్ష అమలు అయ్యే అవకాశముంది.