వచ్చే ఏడాది జూన్ 5 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు నాంధి పలుకుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత సచివాలయంగా రాష్ట్ర సచివాలయాన్ని ఈ నెల 15 కల్లా తీర్చిదిద్దాలని రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
“రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడం” పై రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన & శిక్షణా సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అవగాహన & శిక్షణా కార్యక్రమానికి హాజరైన అన్ని శాఖల సచివాలయ ఎం.ఎల్.ఓ.లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా మైక్రో ప్లాస్టిక్ కారకాల వల్ల మానవాళి, పశుపక్ష్యాధుల ఆరోగ్యాన్ని ఎంతగానో దెబ్బతీస్తున్నాయన్నారు.
పలువురు క్యాన్సర్ బారిన పడి మృత్యు వాతకు గురికావడం కూడా జరుగుచున్నదన్నారు.
ఇటు వంటి ప్లాస్టిక్ ను బ్యాన్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరుగుచున్న నేపధ్యంలో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి మిషన్ మోడ్ లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యాచరణ అమల్లో భాగంగా తొలుత రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులైన ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, స్టిక్కర్లు, సాచెట్లు మరియు ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకం, పంపిణీ మరియు వాడకంపై తక్షణ నిషేధాన్ని అమలు చేయడం జరుగుచున్నదన్నారు.
వీటి స్థానంలో పునర్వినియోగ, బయోడిగ్రేడబుల్ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టడం జరుగుచున్నదన్నారు.
రాష్ట్ర సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో త్రాగునీరు అందుబాటులో ఉండే విధంగా ఆర్.ఓ. ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుచున్నదని, సచివాలయ ఉద్యోగులకు పునర్వినియోగించదగిన స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లను సరఫరా చేయాలని ప్రతిపాదించడమైందన్నారు.
అదే విధంగా ఘనద్రవ్య వ్యర్థాల సేకరణకు మూడు రంగుల డస్టు బిన్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుచున్నదన్నారు.
ఈ విదంగా రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రూపొందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సహకారంతో అమలు చేయడం జరుగుచున్నది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సచివాలయ ఉద్యోగులు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బి.అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు జిఏడి ప్రిన్సిఫల్ సెక్రటరీ చైర్మన్ గా సెక్రటేరియట్ ప్లాస్టిక్ ఫ్రీ టాస్కుఫోర్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్థానంలో పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరుగుచున్నదన్నారు.
నేడు రాష్ట్ర సచివాలయంలో ఎం.ఎల్.ఓ.లకు, వెండర్లకు శిక్షణా, సెన్సిటైజేషన్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుచున్నదని, 5 వ తేదీన ప్రచార సామాగ్రిని ప్రారంభించడం జరుగుతుందని, 11 వ తేదీన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు ట్రైల్ ను మరియు 15 నుండి పూర్తి స్థాయిలో నిషేదించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు పర్చే విధంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు అంతా సహకరించాలని ఆయన కోరారు.
జిఏడి (పొలిటికల్) జాయింట్ సెక్రటరీ సుధాకర్ తో పాటు అన్ని శాఖలకు చెందిన ఎం.ఎల్.ఓ.లు, వెండర్లు ఈ అవగాహన మరియు శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.