రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “మన్మథుడు-2”. ఈ చిత్రంలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్లు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమాలో హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు నటీనటులు నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, నాగచైతన్య, సీనియర్ నటి లక్ష్మి, అమల, వెన్నెల కిషోర్, తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో నాగార్జున తన మాటలతో హుషారెత్తించాడు. అగస్టు 9న తాను రాబోతున్నానని, ఇక నాగచైతన్య, సమంత ఫసక్ అని సరదా కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ సమ్మర్లో తమ పెద్దబ్బాయి చైతన్య ‘మజిలీ’తో వచ్చాడని, మొన్న ‘ఓ బేబీ’ సినిమాతో కోడలు సమంత వచ్చిందని, ఆగష్టు 9న తానొస్తున్నానని, ఇక ఆ రెండు సినిమాలు ఫసక్ అన్నారు. మన్మథుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, కుటంబ సమేతంగా చూడవచ్చని చెప్పారు. మన్మథుడు-2 సినిమా కథ ఓ ఫ్రెంచ్ సినిమా నుంచి తీసుకున్నామని, కథ వినగానే.. తానేంటి ఈ వయసులో లవ్ స్టోరీ ఏంటి అనుకున్నానని, కానీ ఇది తన వయసుకు తగ్గ సినిమా… ప్రేమకు,రొమాన్స్‌కు వయసు లేదని చెప్పే సినిమా అని అన్నారు. అందరూ తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని అనుకుంటున్నారని, సినిమా చూశాక ఉన్నది ఇద్దరు తమ్ముళ్లు అని అంతా అనుకుంటారని సరదాగా వ్యాఖ్యానించారు. ఇక ఒరిజినల్ మన్మథుడుకి ఆడవాళ్లంటే పడదు అని… కానీ ఈ మన్మథుడికి ఆడవాళ్లంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి “మన్మథుడు-2” ఆ అంచనాలను ఎంత మేరకు అందుకుంటుందో చూడాలి.
previous post