telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జార్జి రెడ్డి” మా వ్యూ

George

బ్యాన‌ర్‌ : మైక్ మూవీస్‌, త్రీ లైన్ సినిమాస్‌, సిల్లీ మాంక్స్‌
విడుద‌ల‌ బ్యానర్ : అభిషేక్ పిక్చ‌ర్స్‌
న‌టీన‌టులు : సందీప్ మాధ‌వ్‌, స‌త్య‌దేవ్‌, మ‌నోజ్ నంద‌న్‌, ముస్కాన్‌, మ‌హ‌తి త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం : జీవ‌న్ రెడ్డి
సంగీతం : సురేష్ బొబ్బిలి
కెమెరా : సుధాక‌ర్ యెక్కంటి
ఎడిటింగ్‌ : ప‌్ర‌తాప్ కుమార్
బ్యాగ్రౌండ్ స్కోర్‌ : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్
నిర్మాత‌ : అప్పిరెడ్డి

విద్యార్థి పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీలో 1965 నుంచి 1975 మ‌ధ్య ఎన్నో ఉద్య‌మాలు న‌డిపిన విద్యార్ధినాయ‌కుడు జార్జ్ రెడ్డి. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్‌ రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శం. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ, విద్యార్థి ఉద్యమాల్లో తిరుగు లేని నాయకుడుగా ఎదిగిన జార్జ్ రెడ్డిని చాలా చిన్న వయసులో కొందరు ప్రత్యర్థులు క్యాంపస్‌లోనే హత్య చేశారు. జార్జ్ రెడ్డి అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (పి.డి.యస్.యు)ను స్థాపించారు. ఉద్యమాల‌తో ఎంద‌రినో చైత‌న్య‌ప‌ర‌చిన జార్జ్ రెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో ‘వంగవీటి’ ఫేం సందీప్‌ మాధవ్‌ (సాండి) ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషిస్తున్నారు. దర్శకుడు జీవన్ రెడ్డి “జార్జి రెడ్డి” చిత్రాన్ని ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ :
జార్జిరెడ్డిపై డాక్యుమెంట‌రీ చేయ‌డానికి అమెరికా నుండి ముస్కాన్ అనే అమ్మాయి ఇండియా వ‌స్తుంది. ఈ క్రమంలో జార్జిరెడ్డికి సంబంధించిన వివరాలను సేకరిస్తుంటుంది. జార్జిరెడ్డి (సందీప్ మాధ‌వ్‌) చిన్న‌ప్ప‌టి నుండి క‌మ్యూనిస్ట్ భావాల‌ను క‌లిగి ఉంటాడు. అది గమనించిన ఆయ‌న త‌ల్లి (మ‌రాఠి న‌టి దేవిక‌) సలహా మేరకు భ‌గ‌త్ సింగ్, చెగువేరా వంటి వీరుల జీవిత చరిత్ర‌ల‌ను చదువుతాడు జార్జి రెడ్డి. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఎం.ఎస్సీలో జాయిన్ అయిన జార్జిరెడ్డికి అక్క‌డ జ‌రిగే అన్యాయాలు, అస‌మాన‌త‌లకు ఎదురు తిరుగుతాడు. విద్యార్థుల అండతో కాలేజీ ఎన్నిక‌ల్లో ప్రెసిడెంట్‌గా గెలిచి విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పైనే కాకుండా రైతు స‌మ‌స్య‌ల‌పై కూడా పోరాటం చేస్తాడు జార్జిరెడ్డి. తన పోరాటం కోసం దేశంలోని ప‌లు యూనివ‌ర్సిటీల్లో విద్యార్థుల‌ను ఏకం చేస్తుంటాడు. అత‌ని ఎదుగుద‌ల‌ను ఓర్వ‌లేని కొందరు శ‌త్రువులుగా మారుతారు. ఆ క్ర‌మంలో జార్జిరెడ్డిని హ‌త్య చేస్తారు. అస‌లు జార్జిరెడ్డిని ఎవరు, ఎందుకు హత్య చేశారు ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
హీరో సందీప్ మాధ‌వ్ జార్జిరెడ్డి పాత్ర‌లో చక్కగా ఒదిగిపోయారు. పాత్ర‌కు త‌గ్గట్లు ఆయ‌న నటన, బాడీలాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సందీప్ ఇంతకుముందు నటించిన ‘వంగ‌వీటి’ చిత్రంలో వంగ‌వీటి సోద‌రులు రాధా, రంగా పాత్ర‌ల్లో కూడా ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక జార్జిరెడ్డి త‌ల్లిపాత్ర‌లో న‌టించిన దేవిక ఆ పాత్రకు చక్కగా సరిపోయారు. ఇక హీరోయిన్‌ ముస్కాన్‌, అభ‌య్‌, ప‌వ‌న్‌, స‌త్య‌దేవ్‌, మ‌నోజ్ నందం తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
ద‌ళం చిత్రం తరువాత ఆరేళ్ళు గ్యాప్ తీసుకున్న దర్శకుడు జీవ‌న్ రెడ్డి ఇప్పుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయ‌న చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం. క‌థ‌కు త‌గ్గ న‌టీన‌టులను సరిగ్గా ఎంచుకున్నారు. ఫైర్ బాల్ ఫైట్‌, బ్లేడ్ ఫైట్ లాంటి యాక్షన్ సన్నివేశాలను బాగా తెరకెక్కించారు. కానీ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కావు. వాడు న‌డిపే బండి రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ పాట ఆకట్టుకుంటుంది. 1972 ముందు ప‌రిస్థితుల‌ను చ‌క్క‌టి సెట్స్‌, లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించారు. న‌టీన‌టులు అప్ప‌టి హెయిర్ స్టైల్‌, డ్రెస్సింగ్ స్టైల్‌ల‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. దర్శకుడు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సినిమాను తెరకెక్కించారు.

రేటింగ్ : 2.5/5

Related posts