బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం దక్షిణ ఒడిశా గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటింది.
దీని ప్రభావం, తోడు కొనసాగుతున్న ద్రోణి కారణంగా రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
శని, ఆదివారాల్లో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా శనివారం నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అదనంగా గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిక ఇచ్చింది.
ఏపీలోనూ వాయుగుండం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, శనివారం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అంచనా.
మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కోడెల మృతిపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!