‘ఒకే నగరం-ఒకటే సంబరం’ అనే నినాదంతో విజయవాడ ఉత్సవ్ ఘనంగా ప్రారంభమైంది.
మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద నిర్వహించిన అద్భుతమైన బాణసంచా ప్రదర్శన భక్తులను, సందర్శకులను మంత్రముగ్ధులను చేసింది.
ఈ కళ్లు మిరిమిట్లు గొలిపే దృశ్యాన్ని పున్నమి ఘాట్లో వెంకయ్య నాయుడు, నారా లోకేశ్ సహా పలువురు ప్రముఖులు తిలకించారు.
ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ఈ ఉత్సవం ద్వారా విజయవాడ చారిత్రక ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
“ఒకే నగరం – ఒకటే సంబరం” పేరుతో విజయవాడలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ లో సోమవారం పాల్గొనడం సంతోషంగా ఉంది.
ఓ వైపు దసరా నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు మన సంస్కృతిని తెలియజేసే ఇలాంటి ఉత్సవం వెరసి విజయవాడ నూతన శోభను సంతరించుకుంది.
కళ, సాహిత్య, భాషా రంగాల్లో విశేషమైన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విజయవాడ తెలుగు వారి చరిత్రను కళ్ళకు కడుతుంది.
పౌరాణికంగా, చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విజయవాడ తరతరాలుగా తెలుగు వారి భాష, సంస్కృతుల రాజధానికి, ప్రత్యేకించి దక్షిణాదిన వాణిజ్య రాజధానిగా విరాజిల్లింది, విరాజిల్లుతోంది.
ప్రపంచ పటంలో విజయవాడ, గుంటూరులతో కలిసిన అమరావతి నూతన వైభవం సంతరించుకోవాలన్నది నా ఆకాంక్ష.
మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంపీ శ్రీ కేశినేని ఇతర నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేసారు.