telugu navyamedia
Congress Party తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీసీలకు 42% రిజర్వేషన్ల హామీ ఏం అయ్యింది? – తెలంగాణ కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం , తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో వందరోజుల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పిందని.. కానీ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు అవుతున్న ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

రిజర్వేషన్‌లు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై బట్టకాల్చి మీద వేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇది బీసీ రిజర్వేషన్ల కోసం కాదని.. ముస్లింలకు మేలు చేసేదని విమర్శించారు. గతంలో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా ఉన్న కేసీఆర్ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.

బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి కుదించారని ఆరోపించారు. ఇవాళ(శనివారం ఆగస్టు 2) ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా నిర్వహించింది.

బీసీ డిక్లరేషన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును బీజేపీ నేతలు ఎండగట్టారు. బీజేపీ తెలంగాణ చీఫ్ రాంచందర్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు , బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

గతంలో అమలైన 35 శాతం కంటే కూడా రెండు శాతం రిజర్వేషన్లు తగ్గించేలా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆక్షేపించారు.

20శాతం ఇళ్లలోకి వెళ్లి ఎందుకు సర్వే చేయలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలో జనాభా పెరిగిందని బీసీల జనాభా తగ్గిందని లెక్కలు చెబుతున్నారని తెలిపారు.

42 శాతం పూర్తిగా బీసీలకు రిజర్వేషన్లు దక్కాల్సిందేనని డిమాండ్ చేశారు. బీసీల మెడలు కోసేలా ముస్లింలకు రిజర్వేషన్‌లు ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు న్యాయం చేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఉద్ఘాటించారు. గత 70 ఏళ్లలో కుల గణన ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.

కులగణన చేయని కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పార్లమెంట్ ముందు ముక్కు నేలకు రాయాలని విమర్శించారు కిషన్‌రెడ్డి.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విషయంలో మార్పు వచ్చిందో సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి నిలదీశారు.

రాష్ట్రంలో ముస్లింలకు అమలవుతున్న 4శాతం రిజర్వేషన్‌లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తున్నారని మండిపడ్డారు.

ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లు కింద ముస్లిం, క్రిస్టియన్‌లకు రిజర్వేషన్‌లు కల్పిస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

తెలంగాణ ఏ విషయం లో ఆదర్శమో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాయలో మనం పడకూడదని సూచించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం అన్ని బీసీ సంఘాలు పోరాటం చేయాలని కోరారు. బీసీలకు బీజేపీ అండగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Related posts