మొట్టమొదటిసారి సినిమా పరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశానని హీరో పవన్ కల్యాణ్ అన్నారు.
సినిమా కోసం కష్టపడటమే తనకు తెలుసు తప్ప, అందుకోసం పడిన కష్టం గురించి చెప్పుకోవడం తనకు ఇష్టంలేదని చెప్పుకొచ్చారు.
హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
సినిమా కోసం ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం అని చెప్పాలంటే తనకు మొహమాటంగా ఉంటుందని అన్నారు. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది తనకు తెలియదన్నారు.
నిజానికి ఈ రోజు సాయంత్రం హరిహర వీరమల్లు ఆడియో ఫంక్షన్ ఉందని, అయినప్పటికీ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఏఎం రత్నం గారి కోసమే పెట్టామని పవన్ వివరించారు.
సినిమా బతకాలని చాలా తపన పడే వ్యక్తి, తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి అని ఏఎం రత్నంను కొనియాడారు.
ఈ సినిమా కోసం ఆయన ఎంతగానో తపనపడ్డారని తెలిపారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొందని, షూటింగ్ చాలా ఆలస్యమైందని తెలిపారు.
అయినా కూడా ఈ సినిమా చేయడానికి ఏఎం రత్నం పడిన తపనే కారణమని పవన్ వివరించారు.
ఆయన తపన చూశాక ఈ సినిమాకు తాను ఎంత ఇవ్వగలనో అంత ఇచ్చానని, ఇందులో బెస్ట్ ఫర్మార్మెన్స్ చూపించానని పేర్కొన్నారు.
ఖుషి సినిమా నుంచి ఏఎం రత్నంను దగ్గరగా పరిశీలిస్తున్నానని, కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా ఇండస్ట్రీని బతికించేందుకు ఆయన ఎంతగానో తాపత్రయపడ్డారని పవన్ కల్యాణ్ వివరించారు.
కాగా, ఈ సినిమా కోసం తాను ఎక్కువగా సమయం ఇవ్వలేనని చెప్పినా కష్టపడి షూటింగ్ పూర్తిచేశారని చిత్ర బృందాన్ని పవన్ కొనియాడారు.
క్లైమాక్స్ కోసం ఏకంగా 55 రోజులు షూటింగ్ చేశామని తెలిపారు. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ ఫైట్ కోసం ఉపయోగపడిందని వివరించారు.