తెలంగాణలో సవాళ్ల రాజకీయం నడుస్తుంది. అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరికొకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.
శుక్రవారం కాంగ్రెస్ నిర్వహించిన సభలో మాట్లాడిన సీఎం రేవంత్.. రైతు సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం 9రోజుల్లోనే రూ.9వేల కోట్లను రైతుల ఖాతల్లో జమ చేశామన్నారు.
రైతుల శ్రేయస్సు కోసం చేపట్టిన పనులపై బహిరంగ చర్చకు రావాలంటూ బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
రైతురాజ్యంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. డేట్, టైమ్, ప్లేస్ మీరు చెప్తారా? మమ్మల్ని చెప్పమంటారా అంటూ ప్రశ్నించారు? 72 గంటలు టైం ఇస్తున్నామని.. ప్రిపేర్ అయి రావాలంటూ సెటైర్లు వేశారు.
అంతేకాకుండా రేవంత్ సవాల్ నుంచి పారిపోకుండా చర్చకు రావాలని కోరారు. ‘‘8వ తేదీన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు మేం వస్తాం.
ఆ రోజు 11గంటలకు మీరు రండి. ఒక్కరుగా వచ్చినా.. గుంపుగా వచ్చినా మేం రెడీ. పాలు ఏంటో, నీళ్లు ఏంటో తేలుద్దాం’’ అంటూ కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.
రైతు సంక్షేమానికి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. రైతు బంధు అనేది విప్లవాత్మక పథకం అని.. ఆక్స్ఫర్డ్ లో సైతం దానికి ప్రశంసలు వచ్చాయని చెప్పారు.
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయన్నారు. కానీ గత 18 నెలలుగా రాష్ట్రంలో టైమ్ పాస్ పాలన నడుస్తుందని విమర్శించారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే అందుబాటులో లేని ఎరువులు, విత్తనాలు,.. కాలిపోతున్న మోటర్లు అని అన్నారు.
అంతేకాకుండా ఏడాదిన్నరలో 60వేల ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్ వ్యాఖ్యలను కేటీఆర్ కొట్టిపారేశారు. ఉద్యోగాల భర్తీపై రేవంత్ మాట్లాడటం మిలీనియం జోక్ అని కేటీఆర్ విమర్శించారు.
కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు.. అపాయింట్ మెంట్ లెటర్స్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేశామనడం సిగ్గుచేటన్నారు.
రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని.. కాంగ్రెస్‌కు మరోసారి అధికారం రావడం కల అని ఎద్దేవా చేశారు.
ఏపీ ప్రజలను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసింది: చంద్రబాబు