భారతదేశం ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.
నీతిఆయోగ్ ప్రకారం, భారతదేశ జీడీపీ ప్రస్తుతం 4.18 ట్రిలియన్కు చేరుకుందని గుర్తుచేశారు.
ఈ చారిత్రాత్మక విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వం, అలాగే 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వ ప్రగతిశీల పాలన నిదర్శనంగా చెప్పుకోవచ్చని తెలిపారు.
గత దశాబ్దంలో, ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలన కింద, భారత్ అభివృద్ధి పయనాన్ని నాలుగు ముఖ్యమైన అంశాలు నడిపించాయని చెప్పుకొచ్చారు.
భారత్ వృద్ధి కథ, ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, చేరిక, డిజిటల్ పరివర్తన ద్వారా నడిచిందని పేర్కొన్నారు.
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి, వికసిత్ భారత్ – 2047 వైపు నడిపించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు.
కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన భాగస్వామ్య పక్షాల సమావేశం ఆదివారం ఢిల్లీలోని అశోకా హోటల్లో జరిగింది.
కేంద్రంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరిగింది.
మోదీ 3.0లో ఏడాది పాలన, ఆపరేషన్ సిందూర్, దేశభద్రత సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్షా, రాజ్నాథ్, ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా సమావేశానికి హాజరుకావడం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమాచారం ఇచ్చారు.
ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై మాట్లాడారు. ఈ భేటీలో ఉత్తమ విధానాలపై పలు రాష్ట్రాల సీఎంలు ప్రజెంటేషన్ ఇచ్చారు.