ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతు సోదరుల కష్టాలకు పరిష్కారం చూపేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ చూపడంపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘పవన్ అన్న కు శుభాభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు. ఏనుగుల విధ్వంసంతో నష్టపోతున్న రైతుల కష్టాలు తీర్చేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెప్పించిన ఉప ముఖ్యమంత్రికి, అడగగానే కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక ప్రభుత్వానికి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు ఈ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి నారా లోకేశ్ గుర్తుచేసుకున్నారు.
ఏనుగుల విధ్వంసంతో పంటలు నష్టపోతున్నామని రైతు సోదరులు తమ ఆవేదన వ్యక్తం చేశారని ఆయన అన్నారు.
రైతుల కష్టాలకు చెక్ పెట్టేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవచూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారని తెలిపారు.
కాగా, ఏపీలో ఏనుగుల గుంపులను తరిమికొట్టేందుకు కుంకీ ఏనుగులను ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరగా కర్ణాటక ప్రభుత్వం నాలుగు కుంకీ ఏనుగులను అప్పగించింది.