telugu navyamedia
తెలంగాణ వార్తలు

గౌరవెల్లిలో పారేది నీళ్లు కాదు.. నిర్వాసితుల రక్తం..

కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు కాకుండా భూ నిర్వాసితుల రక్తం పారేలా చేశారని, హామీలపై నిలదీస్తే నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పోలీసులు ఇళ్ల మీద పడి దాడులు చేశారన్నారు. భూ నిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

గౌరవెల్లి భూనిర్వాసితులతో కలిసి బుధవారంనాడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో బండి సంజయ్ భేటీ అయ్యారు. గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జీపై బండి సంజయ్ పిర్యాదు చేశారు.

ఈ భేటీ ముగిసిన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. గౌరవెల్లి భూనిర్వాసితుల సమస్యలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీల సమస్యలు గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం మరోసారి పనులు చేయాలని వేధింపులకు గురి చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు.

బలవంతంగా పనులు చేయిస్తున్నారన్నారు. ఒక్కొక్క సర్పంచ్ కు రూ. 2 నుండి రూ. 30 లక్షలు బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. బిల్లులు రాకపోవడంతో కొందరు ప్రజాప్రతినిధులు కూలిప‌నులు చేసుకుంటున్నార‌ని, మరికొందరు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తమిళిసైకి చెప్పామని వెల్లడించారు..

అలాగే నిర్వాసితుల్లో మహిళలు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

Related posts