telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ … ఆటోలకు క్యూఆర్‌ కోడ్‌… నగరంలో 1.4 లక్షలు.. భద్రతే ప్రధానం..

qr codes to autos for safety and security

ఆటో ప్రయాణికులు ముఖ్యంగా మహిళల భద్రత కోసం హైదరాబాద్‌ పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు.. అభద్రతా భావం తలెత్తకుండా పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆటోవాలాలతో ఇప్పటి వరకు తలెత్తిన సమస్యలకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆటో నెంబర్‌తో సహా డ్రైవర్‌ వివరాలను ట్రాఫిక్‌ పోలీసు కార్యాలయంతో అనుసంధానించి వారికి ఓ క్యూఆర్‌ కోడ్‌ను కేటాయిస్తారు. దీంతో ప్రయాణికుల భద్రతతోపాటు రోడ్డు ప్రమాదాలు.. అక్రమ పార్కింగ్‌లు.. బస్టాపుల్లో తిష్ఠవేసే ఆటోలు… కొంతమంది డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్డ పడనుంది.

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో అధికారికంగా 1.4 లక్షల ఆటోలు తిరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. చాలామంది ఆటోడ్రైవర్ల వద్ద సరైన పత్రాలు, లైసెన్స్‌లు ఉండకపోవడం, ఆటోవాలాలు ప్యాసింజర్లతో అనుచిత ప్రవర్తన, ఎక్కువ డబ్బులు డిమాండ్‌ చేయడం, రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం లాంటి సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వాటిని క్రమబద్ధీకరించి ప్రయాణికుల భద్రత కోసం ఆటోలను పోలీసు శాఖతో అనుసంధానిస్తున్నట్టు సీపీ అంజనీకుమార్‌ ప్రకటించారు. దీని కోసం కొన్ని సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఆటోలకు క్యూఆర్‌ కోడ్‌తో మహిళల భద్రతకు భరోసా కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. మహిళలు ఏ సమయంలోనైనా సురక్షితంగా ప్రయాణించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఆటోలో కూర్చోగానే తమ స్మార్ట్‌ ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపిస్తే ఆటో నెంబర్‌, ఆటోడైవ్రర్‌ ఫోన్‌ నంబర్‌, అతడి పేరు, చిరునామా ఇతర వివరాలన్నీ తెలిసిపోతాయి. ప్రయాణం చేస్తున్నంత సేపు వాహనాన్ని వారు గమనించే అవకాశం ఉంటుంది. ఏదైనా వస్తువు ఆటోలో మర్చిపోయినా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా ఆటోను ట్రాకింగ్‌ చేసి పట్టుకుంటారు. ఇప్పటి వరకు క్యాబ్‌లకు పరిమితమైన ఈ విధానం ప్రస్తుతం ఆటోలకు కూడా వర్తింపచేస్తున్నారు. ఇప్పటికే రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు దీన్ని ప్రారంభించగా… హైదరాబాద్‌ పోలీసులు ఈనెలలో ప్రారంభించనున్నారు. సైబరాబాద్‌లో కూడా ఈ పద్ధతిని త్వరలో అమలు చేసే అవకాశం లేకపోలేదు.

రాచకొండ పరిధిలో ఈనెల 3వ తేదీ వరకు 2,972 ఆటోలకు స్టికర్‌ రిజిస్ట్రేషన్‌ చేశామని ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌రావు తెలిపారు. సేఫ్‌ జర్నీ స్టికర్లు ఉండే ఆటోలలో ప్రయాణం సురక్షితమన్నారు. ఆటోడ్రైవర్లు, యజమానులు ఉప్పల్‌, కుషాయిగూడ, ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్లలో గల కౌంటర్లలో స్టికర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఆయన సూచించారు. ఆటోవాలాలు అందరూ వాహనాలకు స్టికర్‌ అతికించుకోవాలన్నారు.

డ్రైవర్లకు సూచనలు :
– నగరంలో ఆటోలు నడుపుతున్న వారందరూ తమ వాహనాలను ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లలో రిజిస్టర్‌ చేయించకోవాలి. దీని కోసం ఓ ఫార్మాట్‌ను రూపొందించారు.
– యజమాని లేదా డ్రైవర్‌ తన గుర్తింపు, చిరునామాకు సంబంధించిన వివరాలను పోలీసులకు అందజేయాలి.
– వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆటో అద్దెకిస్తే డ్రైవర్‌ లైసెన్స్‌ వివరాలన్నీ జతచేయాలి.
– పోలీసులు జారీచేసే క్యూఆర్‌ కోడ్‌ ప్రింట్‌ను ప్యాసింజర్లకు కనిపించేలా ఆటో ముందు, వెనుక భాగంలో అతికించాలి.
– ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏడాది కాలానికి లేదా… వాహనాల పత్రాల వ్యాలిడిటీ పూర్తయ్యే వరకు (ఏది ముందు వస్తే దానికి) అమల్లో ఉంటుంది. ఆ తర్వాత రెన్యూవల్‌ చేసుకోవాలి.
– తూర్పు, పశ్చిమ, దక్షిణ మండలాలకు చెందిన ఆటో డ్రైవర్లు గోషామహల్‌లో ఏర్పాటు చేస్తున్న రెండు కేంద్రాల్లో, ఉత్తర, మధ్య మండలాలకు చెందిన ఆటో వాలాలు బేగంపేట ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో వివరాలు నమోదు చేసుకోవాలి.
– ఈనెల 17 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆటో డ్రైవర్లు ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.

Related posts