telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

మరో ఇద్దరు ఉగ్రవాదులను .. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. !!

police caught 2 terrorists

ఇటీవల పుల్వామా లో ఆత్మాహుతి దాడి చేసి 44 మంది జవాన్ల మృతికి కారణం అయినట్టుగా ఇంకా బలమైన దాడులను దేశంలో జరపాలని కుట్ర పన్నిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల చేతికి చిక్కారు. వారిద్దరికీ పాకిస్తాన్ ప్రేరేపిత భయానక ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లా దేవ్ బంద్ ప్రాంతంలో వారిద్దరూ పోలీసులకు దొరికారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు, ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, వారిని అరెస్టు చేశారు. రెండు మారణాయుధాలు, బుల్లెట్లతో నిండి ఉన్న క్యాట్రిడ్జ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వారి వినియోగిస్తున్న సెల్ ఫోన్లలో కీలక సమాచారాన్ని సేకరించారు. కొన్ని వీడియో క్లిప్పులు, ఫొటోలు, మ్యాపులు ఉన్నట్లు తేలింది. వారికి ఎక్కడెక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయనే విషయాన్ని పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇద్దరి సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు. ఇద్దరు ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ కు చెందినవారే. జమ్మూకాశ్మీర్ లోని కుల్గామ్ కు చెందిన షానవాజ్, పుల్వామాకు చెందిన అకిబ్ గా గుర్తించారు. పుల్వామా ఉగ్రదాడి తరువాత వారు కనిపించకుండా పోయారు.

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ దాడి తరహాలోనే మరో భారీ పేలుడుకు కుట్ర పన్నినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ తెలిపారు. దేవ్ బంద్ లోని ఓ ప్రైవేటు వసతి గృహంలో వారు కొద్దిరోజులుగా నివసిస్తున్నారని అన్నారు. షానవాజ్ అనే ఉగ్రవాది గ్రనేడ్లను తయారు చేయడంలో నిపుణుడని చెప్పారు. పుల్వామాపై ఉగ్రవాదుల దాడి చోటు చేసుకున్న రోజున వారిద్దరూ జమ్మూకాశ్మీర్ ను విడిచి వెళ్లినట్లు విచారణ సందర్భంగా వెల్లడైందని అన్నారు.

Related posts