telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కిల్లర్” మా వ్యూ

KIller

బ్యానర్‌: పారిజాత మూవీ క్రియేషన్స్ , దివ్య మూవీస్‌
నటీనటులు : విజయ్‌ ఆంటోని, అర్జున్‌, అషిమా నర్వాల్‌, సీత, నాజర్‌ తదితరులు
దర్శకత్వం: అండ్రూ లూయూస్‌
సంగీతం: సైమన్‌ కె.కింగ్‌
సినిమాటోగ్రఫీ: ముఖేష్‌
ఎడిటింగ్‌: రిచర్డ్‌ కెవిన్‌
నిర్మాతలు: టి.నరేష్‌కుమార్‌, టి.శ్రీధర్‌

“బిచ్చగాడు” చిత్రంతో సంచలన విజయాన్ని నమోదు చేసుకుని తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నాడు నటుడు విజయ్ ఆంటోనీ. అయితే ఆ తరువాత ఆయన హీరోగా వచ్చిన భేతాళుడు, యమన్‌, ఇంద్రసేన, రోషగాడు వంటి చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా “కిల్లర్” అంటూ యాక్షన్ కింగ్ అర్జున్ తో కలిసి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుందో చూద్దాము.

కథ :
ఓ హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు పోలీస్ ఆఫీసర్ కార్తికేయ (అర్జున్). అయితే ఆ హత్యను తానే చేసినట్టు ఒప్పుకుంటాడు ప్రభాకర్ (విజయ్ ఆంటోనీ) అనే వ్యక్తి. ఆ హత్య చేయడానికి తనకు, జయంతి (అషిమా నర్వాల్)కు మధ్య ఉన్న ప్రేమే కారణమని చెప్తాడు. అయితే అతను చెప్పిన మాటలు నమ్మని కార్తికేయ తన సీనియర్ ఆఫీసర్ (నాజర్)తో కలిసి మరో కోణంలో నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తాడు. అయితే ఈ హత్య కేసులో కార్తికేయకు నమ్మలేని నిజాలు తెలుస్తాయి. అసలు ప్రభాకర్ ఎవరు ? ప్రభాకర్ కు జయంతికి ఉన్న సంబంధం ఏంటి ? ప్రభాకర్ ఎవరిని హత్య చేశాడు ? ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న కార్తికేయకు తెలిసిన షాకింగ్ నిజాలేంటి ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
విజ‌య్ ఆంటోని సీరియ‌స్ పాత్రలో కన్పించాడు. విజయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర డిజైనింగ్ ఆయ‌న బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయింది. ఇక ఈ సినిమాలో న‌టించిన మ‌రో హీరో యాక్ష‌న్ కింగ్ అర్జున్ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌ పాత్రకు త‌న నటనతో 100 శాతం న్యాయం చేశారు. ఇక ఆషిమా న‌ర్వాల్ తన పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించింది. సీత‌, నాజ‌ర్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
ద‌ర్శ‌కుడు అండ్రూ లూయీస్‌ను తప్పకుండా అభినందించాల్సిందే. సినిమాను స్క్రీన్ ప్లే బేస్‌ చేసుకొని చివరి వరకూ ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించారు. స‌స్పెన్స్‌ తో ప్రేక్షకులను చివరివరకూ సీట్లలో కూర్చోబెట్టగలిగాడు. సినిమాలో ఎక్కడా హీరోయిజం కన్పించదు. పాత్ర‌లు మాత్రమే హైలైట్‌గా నిలుస్తాయి. సైమ‌న్ కింగ్ ట్యూన్స్ కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ముఖేష్ వైదీష్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌ను ఇష్టపడే వారిని ఈ సినిమా తప్పకుండా థ్రిల్ చేస్తుంది.
.
రేటింగ్ : 2.5/5

Related posts