*ఎంపీ నందిగం సురేష్ పీఎస్‌కు వెళ్ళడంపై ఉద్రిక్తత
*అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
*ముగ్గురు యువకులని పీఎస్‌కు తీసుకెళ్ళిన పోలీసులు..
*అనుచరులుతో అర్ధరాత్రి పీఎస్‌లో ఎంపీ నందిగం సురేష్ హల్‌చల్..
వైసిపి ఎంపీ నందిగం సురేష్ అనుచరులుతో కలిసి పోలీస్ స్టేషన్ పై దాడిచేసారంటూ జరుగుతున్న ప్రచారంపై కృష్ణలంక ఎస్సై సత్యానందం స్పందించారు. గత అర్ధరాత్రి మద్యం సేవించి త్రిబుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసామని ఎస్సై తెలిపారు.
అర్ధరాత్రి సమయంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన మాట వాస్తవమేనని…ఈ సందర్భంగా స్టేషన్ ఎస్పై తో కొంత వాగ్వాదం జరిగిందన్నారు. కానీ స్టేషన్లోని ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు… ఎస్సైపై దౌర్జన్యం చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. కేసు నమోదు చేసిన యువకులకు సంబంధించి మాట్లాడేందుకు మాత్రమే నందిగం సురేష్ స్టేషన్ కి వచ్చారని ఎస్సై వివరణ ఇచ్చారు.
అర్ధరాత్రి వైసిపి ఎంపీ అనుచరుల హల్ చల్…
మంగళవారం రాత్రి ఎంపీ నందిగాం సురేష్ మేనల్లుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి విజయవాడలోని స్వర్ష మల్టిప్లెక్స్ లో సినిమాకు వెళ్లారు. అయితే సినిమా ముగిసిన తర్వాత వీరు అదే బైక్ పై ఇళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో అర్ధరాత్రి రోడ్డుపై వాహనాలేవీ లేకపోవడంతో బైక్ ను వేగంగా పోనిచ్చారు. ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వీరిని బస్టాండ్ ఎదురుగా గంగోత్రి హోటల్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కృష్ణలంక ఆపారు.
ఈ క్రమంలో పోలీసులతో యువకులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసులతో వాగ్విదానికి దిగడంతో ఆగ్రహించిన ఎస్సై వీరిపై చేయిచేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఆ యువకుల్లో ఎంపీ మేనల్లుడు వుండటంతో అతనే స్వయంగా రంగంలోకి దిగారు. దీంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది.

